Kolkata doctor murder case: ఆర్జీకర్ ఘటన – వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదు : సిబిఐ
దర్యాప్తుకు ఇంత సమయం ఎందుకు పడుతోందన్న కోర్ట్;
దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార కేసుకు సంబంధించి….కోల్‌కతా హైకోర్టుకు సిబిఐ శుక్రవారం నివేదికనిచ్చింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఓ వైపు చెబుతూనే … మరోవైపు వైద్యురాలిపై సామూహిక హత్యాచారం జరిగిందన్న వాదనను తోసిపుచ్చింది. సిబిఐ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ శుక్రవారం జస్టిస్ తీర్థంకర్ ఘోష్‌తో మాట్లాడుతూ …. ఆగస్టు 9, 2024 న సామూహిక అత్యాచార ఘటన స్థలంలో అందుబాటులో ఉన్న డీఎన్‌ఏ శాంపిల్స్ తో టెస్టులు నిర్వహించామన్నారు. దాదాపు 14 మంది వైద్యుల బృందం ఈ టెస్ట్ ఫలితాలను పరిశీలించిందని తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆధారాలేవని వైద్యుల బృందం నిర్ధారించిందని చెప్పారు. డీఎన్ ఏ ఆధారంగా దోషి సంజరు రాయ్ ప్రమేయం మాత్రమే ఉంది అని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దర్యాప్తుకు ఇంత సమయం ఎందుకు పడుతోంది ? : కోర్టు
మరోవైపు.. బాధిత కుటుంబానికి ముందుగా సమాచారం ఇచ్చిన ఆస్పత్రి మహిళా అసిస్టెంట్‌ను సిబిఐ విచారించలేదని వైద్యురాలి కుటుంబం తరఫు న్యాయవాది సుదీప్త మైత్రా కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలు ఖండించిన సిబిఐ ఆమెను ఇప్పటికే విచారించినట్లు తెలిపింది. దర్యాప్తునకు ఇంత సమయం ఎందుకు పడుతోంది ? అనే దానిపై కోర్టుకు నివేదికను సమర్పించాలని మైత్రా కోరారు. ఈ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీసులు ప్రాథమికంగా రూపొందించిన కేసు డైరీతో పాటు ఇప్పటివరకు విచారించిన వ్యక్తుల జాబితాను సమర్పించాలని సిబిఐకి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 23 తేదీకి వాయిదా వేసింది.