Robert Vadra : అమేథిలో రాబర్ట్ వాద్రాకు అనుకూలంగా పోస్టర్లు
ఇప్పటికే రాయ్‌బరేలిలో ప్రియాంకగాంధీకి అనుకూలంగా పోస్టర్లు;
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అమేఠీ, గౌరీగంజ్‌లోని కాంగ్రెస్ కార్యాలయాల బయట అబ్ కీ బార్ రాబర్డ్ వాద్రా అన్న ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్ జరగనున్న అమేఠీ స్థానానికి కాంగ్రెస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కేరళలోని వయనాడ్‌లో రెండో విడతలో భాగంగా ఈనెల 26న పోలింగ్ జరగనుంది. అక్కడి పోలింగ్ సరళిని బట్టి అభ్యర్థిని ఎంపిక చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి పెట్టని కోట. అలాంటి స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం రకరకాల ఊహాగానాలకు దారి తీస్తోంది. అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఇటీవల ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగానే అమేఠీ, గౌరీగంజ్‌లోని కాంగ్రెస్ కార్యాలయాల బయట అబ్ కీ బార్ రాబర్ట్ వాద్రా అన్న ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. అమేఠీ నుంచి రాబర్ట్ వాద్రా పోటీ చేయలంటూ ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు జోడించారు. ఐదో విడతలో భాగంగా అమేఠీ స్థానానికి మే20న ఎన్నిక జరగనుండగా నామినేషన్ దాఖలు చేసేందుకు మే3 వరకు గడువుంది. ఈనెల 26న రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌కు పోలింగ్ జరగనుంది. అక్కడి పోలింగ్ సరళిని బట్టి అమేఠీ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అమేఠీపై రోజుకొక వార్త తెరపైకి వస్తోంది.
మరోవైపు అమేఠీ నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాబర్ట్ వాద్రా పోటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలింగ్‌కు ఇంకా కొన్ని రోజులే ఉందని అయినా ఇంకా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఈ స్థానంపై రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కన్నేశారని ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారన్న ఆమె ఇప్పుడు రాహుల్ కూడా తన సీటును బుక్ చేసుకునేందుకు అలానే చేయాలేమోనని ఎద్దేవా చేశారు.
అమేఠీ నియోజకవర్గం నుంచి గతంలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు పోటీ చేసి గెలుపొందారు. అయితే 2019లో రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఐతే కేరళలోని వయనాడ్‌లో రాహుల్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మళ్లీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అటు ఇప్పటివరకు సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి రాబర్ట్ వాద్రా సతీమణి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ బరిలోకి దిగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపైనా హస్తం పార్టీ ఇంకా స్పష్టతనివ్వలేదు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన సోనియా రాజస్తాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాయ్‌బరేలీ నుంచి ఎవరి పోటీ చేస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలోనే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది