ED Accuses Robert Vadra: రాబర్ట్ వాద్రాకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

రూ. 38 కోట్ల విలువైన 43 ఆస్తులను జప్తు చేయాలని అభ్యర్థన;

Update: 2025-08-11 00:08 GMT

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతోపాటు, ఈ కేసులో అక్రమంగా సంపాదించిన రూ. 38.69 కోట్ల విలువైన 43 స్థిరాస్తులను ప్రభుత్వపరం చేయాలని కూడా కోరింది.

ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు, వాద్రాకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది.

గురుగ్రామ్‌లోని భూమి అమ్మకానికి సంబంధించి తప్పుడు వివరాలతో దస్తావేజులు సృష్టించారని ఈడీ తన చార్జిషీట్‌లో ప్రధానంగా ఆరోపించింది. భూమి విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపారని, దీనివల్ల హర్యానా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 44 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొంది. అమ్మకం దస్తావేజులో భూమి విలువను రూ. 7.50 కోట్లుగా చూపినప్పటికీ, వాస్తవానికి అంతకంటే ఎక్కువ మొత్తం చేతులు మారినట్లు ఈడీ తెలిపింది.

ఈ లావాదేవీల ద్వారా రాబర్ట్ వాద్రా రూ. 58 కోట్ల వరకు అక్రమంగా ఆర్జించారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చిన సొమ్ము అని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో మనీలాండరింగ్ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించామని వెల్లడించింది. కేసులోని నిందితులు, వారికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలు ఎక్కువగా ఢిల్లీలోనే ఉన్నందున, ఇక్కడి ప్రత్యేక కోర్టులో కేసు దాఖలు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.

ఈ కేసులో వాద్రా, ఇతర నిందితులకు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 4 కింద గరిష్ఠ శిక్ష విధించడంతో పాటు, ఐపీసీ సెక్షన్ 423 (మోసపూరిత దస్తావేజుల సృష్టి) కింద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది.

Tags:    

Similar News