Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటనపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
వచ్చే నెలలో మోడీ, భాగవత్ ల కు నిండనున్న 75 ఏళ్లు
దేశంలో ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో ఉన్న నాయకులు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌పై చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చేశారు. తాను గానీ.. మరొకరు గానీ 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 75 ఏళ్ల పదవీ విరమణపై అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. సెప్టెంబర్‌లో మోడీ కంటే 6 రోజుల ముందు మోహన్ భాగవత్‌కు 75 ఏళ్లు నిండనున్నాయి.
తనకు 80 ఏళ్లు నిండినా.. తాను కోరుకున్నా.. లేకపోయినా సంఘ్ కోరుకున్నంత కాలం పని చేస్తానని మోహన్ భాగవత్ వెల్లడించారు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం అయోధ్య రామమందిర ఉద్యమానికే మద్దతు తెలిపిందని.. కాశీ-మథుర ఆలయంతో సహా మరే ఆలయ ఉద్యమానికి మద్దతు ఇవ్వబోదని స్పష్టంచేశారు. మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వ్యక్తులకు ఉంటుందని.. అయితే ప్రలోభాలు, బలవంతాలు ఉండకూడదన్నారు. అక్రమ వలసదారులకు ఉద్యోగాలు ఇవ్వకూడదని.. ముస్లింలతో సహా మనవారికి మాత్రమే ఇవ్వాలని తెలిపారు. బీజేపీకి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయిస్తుందన్న భావన పూర్తిగా వాస్తవ విరుద్ధమని భాగవత్ కొట్టిపారేశారు. మతపరమైన దాడుల్ని సంఘ్ సమర్థించదని.. ఇస్లాం ఉండకూడదన్నది హిందూ ఆలోచనా విధానమే కాదన్నారు. భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు ఆందోళనకరమని.. అంతర్జాతీయ వాణిజ్యం అవసరమే కానీ ఒత్తిడి కింద స్నేహం సాధ్యం కాదని భాగవత్ క్లారిటీ ఇచ్చారు.
ఇక 75 ఏళ్ల తర్వాత కూడా మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. బీజేపీ పని నియమాల్లో వయో పరిమితి లేదని క్లారిటీ ఇచ్చారు.