Manikrao Kokate: అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి..

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో కోకాటేకు క్రీడల శాఖ అప్పగించిన సర్కార్..;

Update: 2025-08-01 04:45 GMT

మహారాష్ట్ర అసెంబ్లీలో మొబైల్‌ ఫోన్‌లో రమ్మీ  ఆడుతూ కెమెరాకు చిక్కిన వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకాటేపై వేటు పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత క్రీడామంత్రి దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే, మహారాష్ట్రలో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి గురువారం నాడు అర్ధరాత్రి ఓ ప్రకటన వెల్లడైంది. ఇప్పటి వరకు మాణిక్‌ రావ్‌ కోకాటే వ్యవసాయశాఖ మంత్రిగా విధులు నిర్వహించగా.. ఆ బాధ్యతల నుంచి తప్పించి ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణెకు అప్పగించారు. ఇక, కోకాటేకు క్రీడలు, యువజన సంక్షేమ మంత్రిత్వశాఖను కేటాయిస్తున్నట్లు ఆదేశాలు వచ్చాయి. వివాదాస్పదమైన చర్యలకు పాల్పడే మంత్రులపై తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాల కోసం ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

కానీ, అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించక పోగా.. కేవలం శాఖను మార్చడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదమైంది. ఇలా చేయడం జవాబుదారీతనం అనిపించుకోదు.. కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని శివసేన (యూబీటీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు క్రీడల శాఖను అప్పగించడమంటే.. అసెంబ్లీలో రమ్మీ ఆడటాన్ని అధికారికంగా పర్మిషన్ ఇచ్చినట్లే అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News