Karnataka: కర్ణాటక తీరంలో చైనా గూఢచార పక్షి
కీలకమైన నావికా స్థావరం వద్ద ఘటనతో భద్రతా సంస్థల అప్రమత్తం
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ తీరంలో ఓ వలస పక్షి కలకలం సృష్టించింది. దేశంలో అత్యంత కీలకమైన నావికా స్థావరం ఉన్న ఈ ప్రాంతంలో, చైనాకు చెందిన జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి (సీగల్) గాయపడిన స్థితిలో కనిపించడం ఆందోళనకు కారణమైంది.
మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్‌లో కోస్టల్ మెరైన్ పోలీసులు ఈ పక్షిని గుర్తించారు. గాయపడి ఉన్న దానిని వెంటనే అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పక్షిని పరిశీలించగా, దాని శరీరానికి ఒక జీపీఎస్ ట్రాకింగ్ పరికరం కట్టి ఉండటాన్ని గమనించారు. ఈ పరికరానికి ఒక చిన్న సోలార్ ప్యానెల్ కూడా ఉంది.
ట్రాకర్‌పై ఒక ఈమెయిల్ ఐడీతో పాటు "ఈ పక్షి కనిపిస్తే దయచేసి ఈ ఐడీకి సమాచారం ఇవ్వండి" అనే సందేశం కూడా ఉంది. పోలీసులు ఆ ఈమెయిల్ ఐడీని పరిశీలించగా, అది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన 'రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో-ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్' అనే సంస్థదిగా తేలింది. దీంతో అధికారులు స్పష్టత కోసం సదరు సంస్థను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు.
"వలస పక్షుల కదలికలను అధ్యయనం చేసే శాస్త్రీయ పరిశోధనలో భాగంగా దీన్ని అమర్చారా? లేక మరేదైనా కోణం ఉందా? అని అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నాం" అని ఉత్తర కన్నడ ఎస్పీ దీపన్ ఎంఎన్ తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన నావికా స్థావరం సమీపంలో ఈ ఘటన జరగడంతో భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి.