Jharkhand: గాయపడిన మావోయిస్ట్‌కు ప్రాణదానం చేసిన పోలీసులు

5 కి.మీ. భుజాలపై మోసి.. ఆస్పత్రికి ...

Update: 2023-10-16 05:30 GMT

గాయాలతో పడి ఉన్న మావోయిస్ట్‌ ప్రాణాలు నిలపడానికి తీవ్రంగా శ్రమించి మానవత్వాన్ని చాటుకున్నారు కొంతమంది పోలీసులు. ఎదురుకాల్పుల్లో గాయపడిన మావోయిస్ట్‌ను తమ భుజాలపై మోస్తూ అడవిలో ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మరీ క్యాంపునకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అంటే కాదు తరువాత అతడ్ని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో తరలించారు. భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్న ఈ ఘటన ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భమ్ జిల్లా చైబాసా కోల్హాన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది.

స్థానిక అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కోసం భద్రతా బలగాలు శుక్రవారం కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఎదురపడిన నక్సల్స్ కాల్పులు జరపడంతో ఎప్పటిలాగే  అప్రమత్తమైన పోలీసుల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభించారు. అయితే ఈ  కాల్పుల్లో ఓ మావోయిస్టు తీవ్రంగా గాయపడగా.. అతడ్ని వదిలిపెట్టి మిగతా నక్సలైట్‌లు అక్కడ నుంచి తప్పించుకు వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉండిపోయి గాయాల బాధతో మూలుగుతున్న అతడ్ని పోలీసుల గుర్తించారు. అతడికి వైద్యం చేయించాలనే ఉద్దేశంతో భద్రతా సిబ్బంది అతనిని భుజాలపైకి ఎత్తుకున్నారు. మందుపాతరలు అమర్చిన మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర అత్యంత అప్రమత్తంగా నడుస్తూ హాథీబురులోని సీఆర్పీఎఫ్ క్యాంపునకు తరలించారు. అక్కడి వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శనివారం అతడిని మెరుగైన చికిత్స కోసం రాజధాని రాంచీలోని ఆసుపత్రికి హెలికాప్టర్‌లో ‌తరలించారు.


ఈ సందర్భంగా సింగ్భమ్ ఆపరేషన్స్ ఐజీ  అమోల్ హాంకర్ మాట్లాడుతూ.. డీజీపీ సూచనలతోనే మావోయిస్ట్‌కు వైద్యం చేయించడానికి తరలించామన్నారు. మారుమూల గ్రామాలకు  ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తీవ్రవాదాన్ని అంతం చేయాలనేది తమ  లక్ష్యం అని చెప్పారు. ఆయుధాలు విడనాడాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. చైబాసాలోని కోల్హాన్ ప్రాంతాన్ని మావోయిస్ట రహితంగా చేసే ప్రయత్నంలో రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్‌కు చెందిన నలుగురు అమరులై.. 28 మంది సిబ్బందిని గాయపరిచినప్పటికీ గాయపడిన నక్సల్‌ను రక్షించే విషయంలో భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి. 

Tags:    

Similar News