Lawrence Bishnoi: ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై కాల్పులు!

ప్రత్యర్థి గ్యాంగ్ పనేనని అనుమానిస్తున్న పోలీసులు, దర్యాప్తు ముమ్మరం

Update: 2026-02-25 02:14 GMT

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు సంబంధించిన న్యాయవాది రజనీ ఖత్రీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఆమె భర్త ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఒకరు గాయపడ్డారు.

మంగళవారం రాత్రి సుమారు 10:15 గంటల సమయంలో ఉత్తర ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రజనీ ఖత్రీ భర్త దీపక్ ఖత్రీ తన స్నేహితులతో కలిసి సియాజ్ కారులో వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కారును వెంబడించి వెనుక నుంచి నాలుగు నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల వల్ల కారు వెనుక అద్దాలు పగిలిపోయాయి. కారులో ఉన్న సందీప్ అనే వ్యక్తి భుజంలో బుల్లెట్ తగిలి గాయపడ్డాడు. ఘటన సమయంలో కారులో ఐదుగురు ఉన్నప్పటికీ, న్యాయవాది రజనీ ఖత్రీ మాత్రం అందులో లేరని పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాత్రి 10:10 గంటల ప్రాంతంలో కాల్పుల సమాచారం అందిందని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బంథియా తెలిపారు.

ప్రాథమిక విచారణలో ఇది ప్రత్యర్థి గ్యాంగ్ పని కావచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు చేపట్టాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News