Snake Catcher : పామును పట్టి మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌;

Update: 2025-07-17 06:30 GMT

 పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాఘోగఢ్‌లోని కాట్రా మొహల్లా ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల దీపక్ మహాబర్‌ పదేళ్లుగా పాములు పడుతున్నాడు. ఎవరైనా తమ ఇల్లు, షాపు లేదా కార్యాలయంలో పాము ఉందని అతడికి ఫోన్‌ చేయగానే అక్కడి వెళ్లేవాడు. పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేవాడు. ఇలా పదేళ్లకుపైగా వందల సంఖ్యలో పాములు పట్టాడు. ఎవరి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకునేవాడు కాదు. ఉచితంగానే పాములు పట్టి సురక్షిత ప్రాంతంలో విడిచి పెట్టేవాడు. జేపీ యూనివర్సిటీలో పాములు పట్టే వ్యక్తిగా పాపురల్‌ అయ్యాడు.

కాగా, జూలై 14న రాఘోగఢ్‌లోని బర్బత్‌పురాలో ఒక ఇంట్లోకి పాము ప్రవేశించినట్లు దీపక్‌కు ఫోన్‌ వచ్చింది. దీంతో బైక్‌పై అక్కడకు చేరుకున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు. అయితే కుమారుడి స్కూల్‌ ముగిసే సమయం కావడంతో ఆ పామును మెడలో వేసుకుని బైక్‌పై అక్కడకు వెళ్లాడు. కుమారుడితో కలిసి బైక్‌పై ఇంటికి చేరుకున్నాడు.

మరోవైపు దీపక్‌ మెడలో పాము ఉండటం చూసి అతడి ఇంటి వద్ద కొందరు వీడియో రికార్డ్‌ చేశారు. ఆ తర్వాత మెడలో ఉన్న ఆ పాము అతడి చేతిపై కాటు వేసింది. దీంతో దీపక్‌ ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పి సహాయం కోరాడు. తొలుత రాఘోగఢ్‌లోని స్థానిక ఆసుపత్రికి అతడ్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గుణాలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కాగా, సోమవారం సాయంత్రం దీపక్‌ పరిస్థితి మెరుగుపడినట్లు కనిపించింది. దీంతో ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ రాత్రికి అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు దీపక్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున అతడు మరణించాడు.

పోస్ట్‌మార్టం తర్వాత దీపక్‌ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కాటుకు ముందు మెడలోని పాముతో బైక్‌పై ఉన్న దీపక్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Tags:    

Similar News