Hathras: సంఘ వ్యతిరేక శక్తుల వల్లే తొక్కిసలాట- భోలేబాబా
హత్రాస్ తొక్కిసలాటపై స్పందించిన భోలేబాబా,;
ఉత్తర్‌ప్రదేశ్ హత్రాస్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పో్యారు. తనను తాను దేవుడిగా చెప్పుకునే ‘భోలే బాబా’ సత్సంగ్ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో రావడం, అందుకు తగ్గట్లు సౌకర్యాలు లేకపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. అయితే, ఈ సంఘటన జరిగనప్పటి నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు. ఈ రోజు సాయంత్రం ఒక ప్రకటనలో ఈ సంఘటనకు ‘‘సంఘ వ్యతిరేక శక్తులు’’ కారణమని ఆరోపించార. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతునట్లు ప్రకటించారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో భోలే బాబా పేరు నమోదు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అతని సహాయకులు, ఈవెంట్ నిర్వాహకుల పేర్లు ఎఫ్ఐఆర్‌లో నమోదయ్యాయి. భోలే బాబాను అరెస్ట్ చేస్తారనే ప్రశ్నకు రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ సంఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. సమావేశ నిర్వాహకులు సంఘటనను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ సంఘటనపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దోషులను వదిలిపెట్టేది లేదని సీఎం చెప్పారు. భోలే బాబా పాదాల వద్ద ధూళిని తీసుకునేందుకు జనాలు ఎగబడటం, అదే సమయంలో అతని సెక్యూరిటీ ప్రజల్ని నెట్టేయడంతో తొక్కిసలాట ప్రారంభమైనట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది.