Delhi Air Pollution: ఢిల్లీలో కాలుష్యం ఎలాగైనా సరే ఆపాల్సిందే.. సుప్రీం

'పంట వ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం' - వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర

Update: 2023-11-08 03:15 GMT

దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం రాజకీయ యుద్ధంగా మారకూడదని, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యం దెబ్బతీయడానికి కారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలో పంట వ్యర్ధాలను తగులబెట్టడం ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరగడానికి ముఖ్య కారణమని కోర్టు పునరుద్ఘాటించింది. వ్యర్థాల దగ్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘వెంటనే ఇది ఆగాలి. అందుకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. పంట వ్యర్థాల దహనాన్ని ఆపడం మీ విధి’ అని పేర్కొన్నది.

కాలుష్యంపై ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అన్ని సమయాల్లో రాజకీయ యుద్ధం ఉండకూదని సూచించింది. ‘ఈ పంట వ్యర్థాల దహనం ఆగడం లేదు. దీన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకొన్నాయి’ అని ప్రశ్నించింది. కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోనివ్వకూడదని అభిప్రాయపడింది. ఏండ్లుగా కాలుష్య సమస్య ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పరిష్కారాన్ని గుర్తించలేదని ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు పలు కీలకమైన సూచనలు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో ఘన వ్యర్ధాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని నియంత్రించాలని సూచించింది.


మరోవైపు  కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్‌, ఘజియాబాద్‌లో ఉన్నత పాఠశాలలను మూసివేశారు. రాబోయే ఆరురోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వాన్నస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని.. దాంతో కాలుష్యం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, నవంబర్‌ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది. 

Tags:    

Similar News