సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. జులై 19న జరగనున్న తదుపరి విచారణ వరకు మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. బుధవారం వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించే వరకు బెయిల్ కొనసాగించవచ్చు అని ప్రకటించింది.
2002 గోధ్రా అనంతర అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు సాక్ష్యాధారాలను కల్పించారన్న ఆరోపణలపై లొంగిపోవాల్సిందిగా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. రెగ్యులర్ బెయిల్ కోసం ఆమె చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. శనివారం అర్థరాత్రి ఈ విషయాన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాలను సవాలు చేయడానికి కార్యకర్తకు ఎందుకు సమయం నిరాకరించారని ప్రశ్నించింది. మధ్యంతర బెయిల్ మంజూరు కోసం చేసిన దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్న కోర్టు, సెప్టెంబర్ 2, 2022 నాటి ఉత్తర్వు ప్రకారం కొన్ని షరతులపై బెయిల్ మంజూరు చేసింది. పిటిషనర్ ఒక మహిళ కావడం మరియు ప్రత్యేక రక్షణకు అర్హులు కావడంతో బెయిల్‌పై నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 1న సుప్రీంకోర్టు అరెస్టు నుండి రక్షణ కల్పిస్తూ మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. గోధ్రా అనంతర అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు, విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన నానావతి కమిషన్ కు, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని, కల్పిత సాక్ష్యాలను రూపొందించినందుకు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నేరం నమోదు చేసింది. ఈ విషయం లో గత ఏడాది జూన్‌లో శ్రీమతి సెతల్వాద్‌తో పాటు గుజరాత్ మాజీ పోలీసు చీఫ్ ఆర్‌బి శ్రీకుమార్, మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్ లో ఆమెకు ఊరట లభించింది. అప్పటినుంచి ఆమె మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. అయితే ఆమె సాధారణ బెయిల్ కోసం తాజాగా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో తక్షణమే లొంగి పోవాలని ఆదేశించింది.