Supreme Court: ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్, ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్

తదుపరి విచారణ జూలై 22వ తేదీకి వాయిదా;

Update: 2025-06-25 04:00 GMT

 ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సర్టిఫికెట్ల జారీకి అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. ఈ అంశం చాలా ముఖ్యమైంది.. కొన్ని అంశాలను పరిష్కరించిన తరువాత మార్గదర్శకాలను జారీ చేస్తామని జస్టిస్ విశ్వనాథ్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు.

ఢిల్లీకి చెందిన ఓబీసీ మహిళ, ఒంటరి తల్లి తన పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల కోసం జనవరి 31న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను భర్త నుంచి విడిపోయానని, తన పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే తండ్రి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఆయన రక్త సంబంధీకుల సర్టిఫికెట్ అయినా కావాలని అధికారులు అంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. తండ్రి లేదంటే తండ్రి తరపున రక్తసంబంధీకుల సర్టిఫికెట్ ఆధారంగానే పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒంటరి తల్లుల పిల్లల హక్కులను హరించేలా ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఒంటరి తల్లుల సర్టిఫికెట్ ఆధారంగానే పిల్లలకు సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. ఓబీసీలకు ఇది వర్తించట్లేదు అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఏం చెప్పిందంటే.. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ జారీకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశమిది. కొన్ని అంశాలను పరిష్కరించిన తరువాత మార్గదర్శకాలను జారీ చేస్తాం. విడాకుల తీసుకున్న ఒక మహిళ పిల్లల ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రంకోసం మాజీ భర్త వద్దకు ఎలా వెళ్లగలదు..అంటూ ప్రశ్నించారు.

అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా.. సోమవారం అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున వాదనలు వినిపించారు. 2012 నాటి రమేశ్ భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను వెలువరించాలని విన్నవించారు. సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News