Supreme Court: సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు

న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా;

Update: 2025-05-06 05:00 GMT

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా, సుప్రీంకోర్టు సోమవారం తన వెబ్‌సైట్‌లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్‌లోడ్ చేసినట్లు తెలిపింది.

ఏప్రిల్‌ 1న పూర్తిస్థాయి ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు న్యాయమూర్తులు స్వయంగా అందజేసిన ఆస్తుల వివరాలను తన వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మరికొందరు న్యాయమూర్తుల నుంచి ఆస్తుల వివరాలు అందిన వెంటనే వెబ్‌సైట్‌ లో అప్ లోడ్ చేస్తామని కోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు నియామకాల పూర్తి ప్రక్రియను, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన బాధ్యతలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత యూనియన్ నుంచి వచ్చిన వివరాలు, ఇన్‌పుట్‌లు, సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలనతో సహా, ప్రజల జ్ఞానం, అవగాహన కోసం అత్యున్నత న్యాయస్థానం తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

“నవంబర్ 9, 2022 నుంచి మే 5, 2025 వరకు హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ప్రతిపాదనలు, పేర్లు, హైకోర్టు, సర్వీస్ లేదా బార్ నుంచి వచ్చిన వివరాలు, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తేదీ, న్యాయ శాఖ నోటిఫికేషన్ తేదీ, నియామక తేదీ, ప్రత్యేక వర్గం (SC/ST/OBC/మైనారిటీ/మహిళ), అభ్యర్థి ఏదైనా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు/సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించినవారా అనే వివరాలను కూడా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.

Tags:    

Similar News