Religious Conversion : రిజర్వేషన్ల కోసం.. మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమే: సుప్రీంకోర్టు

రిజర్వేషన్ కోసం హిందువునంటే కుదరదు..;

Update: 2024-11-28 01:30 GMT

నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమేనని స్పష్టం చేసింది. సెల్వరాణి అనే మహిళ హిందూ తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించింది. పుట్టిన కొన్నిరోజులకే బాప్టిజం తీసుకొని, క్రైస్తవాన్ని ఆచరిస్తున్నది. పుదుచ్చెరిలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు తన తండ్రి కులమైన వెల్లువన్‌గా తనకు ఎస్సీ సర్టిఫికెట్‌ జారీ చేయించాలని ఆమె మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె వినతిని హైకోర్టు జనవరి 24న తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ పంకజ్‌ మితల్‌, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.

బాప్టిజం తీసుకుంటే  హిందువు కాదు 

ఈ కేసులో ఇచ్చిన 21 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు కీలక విషయాలను పేర్కొన్నది. ‘మతంపై నిజమైన విశ్వాసం లేకుండా, కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందేందుకు మతం మారడాన్ని అనుమతించలేం. ఇలాంటి నిగూఢ ఉద్దేశాలు కలిగిన వ్యక్తులకు రిజర్వేషన్ల ప్రయోజనాలు అందడం అంటే రిజర్వేషన్ల విధాన లక్ష్యాన్ని ఓడించడమే అవుతుంది.’ అని ధర్మాసనం పేర్కొన్నది. ఉద్యోగం కోసమే పిటిషనరు హిందువుగా చెప్పుకొని ఎస్సీ సర్టిఫికెట్‌ అడుగుతున్నారని, బాప్టిజం తీసుకున్న తర్వాత ఆమె హిందువుగా గుర్తింపును పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఆమె ఇప్పటికీ క్రైస్తవాన్ని ఆచరిస్తున్నారనే విషయం చర్చి అటెండెన్స్‌ ద్వారా స్పష్టమవుతున్నదని, కాబట్టి హిందువుగా ఆమె చేస్తున్న వాదనను సమర్థించలేమని పేర్కొన్నది. క్రైస్తవంలోకి మారే వారు తమ కుల గుర్తింపును కోల్పోతారని, ఒకవేళ వారు ఎస్సీ ప్రయోజనాలు పొందాలనుకుంటే మళ్లీ మతం మారినట్టు కచ్చితమైన ఆధారం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్‌ ఏ కార్యక్రమంలో లేదా ఆర్యసమాజ్‌ ద్వారా మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించలేదని, ఆమె ఇప్పటికీ క్రైస్తవాన్ని పాటిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

కేసు పూర్తి వివరాలు ఏంటంటే 

పుదుచ్చేరి‌కి చెందిన పిటిషనర్‌ సెల్వరాణి తండ్రి హిందువు, తల్లి క్రిస్టియన్‌. ఆమెకు మూడు నెలల వయసులో బాప్టిజం పొందారు. అయితే, 2015లో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఈ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి షెడ్యూల్డ్ కులానికి (వల్లువన్‌) చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఎస్సీ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీనిని ఆమె మద్రాసు హైకోర్టులో సవాల్‌ చేయగా. అధికారుల నిర్ణయం సరైందేనని తీర్పు చెప్పింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పు సరైందేనని సమర్దించింది.

Tags:    

Similar News