Swiggy: వినియోగదారులకు షాక్ ఇచ్చిన స్విగ్గీ .. భారీగా ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు!
మెట్రో నగరాల్లో భారీగా ఫ్లాట్ ఫారమ్ ఫీజులు పెంచిన వైనం;
భారతీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా ఉన్న స్విగ్గీ, తన ప్లాట్‌ఫారమ్ ఫీజును కొన్ని ప్రాంతాల్లో 17 శాతం పెంచి రూ.14గా నిర్ణయించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఈ పెంపును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పండుగ సీజన్‌లో పెరిగిన ఆర్డర్ల కారణంగానే ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
2023లో కేవలం రూ.2గా ఉన్న ఈ ఫీజు, ఇప్పటివరకు 600 శాతం పెరిగింది. మరోవైపు జొమాటో తన ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.10 వద్ద కొనసాగిస్తోంది. 2024 ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో ప్లాట్‌ఫారమ్, హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై రూ.9–15 వరకు వసూలు చేస్తున్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో 1–3 శాతం వరకు ఉంటుంది.
మెట్రో నగరాల్లో బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. మార్కెట్‌లో జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి సంస్థలు మాత్రమే ఉండటంతో హ్యాండ్లింగ్, కన్వీనియెన్స్, స్మాల్ ఆర్డర్ ఫీజులు సాధారణమవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక్కో ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేసినా సంస్థలకు భారీ ఆదాయం లభిస్తుంది. వినియోగదారులను ఆకర్షించడానికి గతంలో ఎక్కువ ఖర్చు చేసిన ఈ సంస్థలు, ఇప్పుడు లాభాల పెంపుపై దృష్టి సారిస్తున్నాయి.