Kodaikanal: కొడైకెనాల్‌లో ఆకట్టుకుంటున్న పూల ప్రదర్శన
అరుదైన జాతి పుష్పాల ప్రదర్శన.... కొడైకెనాల్‌కు పర్యాటకుల తాకిడి..;
వేసవి విడిది కేంద్రం కొడైకెనాల్‌లో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పూల ప్రదర్శన ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరగనున్న ఈ షోలో దేశం నలుమూలల నుంచి తెచ్చిన అరుదైన జాతి పుష్పాలను ప్రదర్శనకు ఉంచారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువుల ఆకారంలో రూపొందించిన పూల నమూనాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.
తమిళనాడు కొడైకెనాల్‌లో పూల ప్రదర్శన ప్రారంభం అయ్యింది. ఈ ఫ్లవర్ షో మే 17 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా అనేక సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన అనేకరకాల పూలతో పలు ఆకారాలను రూపొందించారు. అరుదైన జాతికి చెందిన పూలు , మొక్కలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఈ షోను వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. పుష్పాల ప్రదర్శనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి..
వేసవి విడిది కేంద్రమైన కొడైకెనాల్‌కు ఈసారి పర్యాటకుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోందని స్థానికులు తెలిపారు. తాను కొడైకెనాల్‌ను చాలా సార్లు సందర్శించానని.. కానీ పూల ప్రదర్శన చూడటం....ఇదే తొలిసారని ఓ పర్యాటకుడు తెలిపారు. పూలు అలంకరించిన ఆకారాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఈ సారి షోలో తులిప్, కార్నేషన్ వంటి పుష్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు మరో పర్యాటకురాలు పేర్కొన్నారు. వాటితో పాటు నెమలి, ఎలుగుబంటి వంటి జంతువుల ఆకారంలో తీర్చిదిద్దిన పూల నమూనాలు ఎంతో అందంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.