Tamil Nadu: వెలుగులోకి పోస్ట్‌మార్టం రిపోర్ట్.. తమిళనాడు లాకప్‌ డెత్‌ కేసు..

తీవ్రమైన గాయాలు కారణంగానే చనిపోయినట్లుగా నివేదిక;

Update: 2025-07-04 07:00 GMT

తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దొంగతనం కేసులో ఆలయ గార్డును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చావబాదారు. పోలీసులు ఇష్టానురీతిగా కొట్టడంతో అజిత్ కుమార్(28) ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దీంతో విపక్ష పార్టీలు.. డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్రం లాకప్ డెత్‌లకు మాతృభూమిగా మారిపోయిందంటూ ధ్వజమెత్తాయి. తక్షణమే స్టాలిన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మద్రాస్ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఒక పౌరుడిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్‌ చేసినంటూ ట్రీట్‌ చేస్తారా? అంటూ ప్రశ్నించింది. ఇక పెను దుమారం చెలరేగడంతో స్టాలిన్ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు.

ఇక తాజాగా అజిత్ కుమార్‌కు సంబంధించిన పోస్టుమార్టం వెలుగులోకి వచ్చింది. శరీరంపై 44 గాయాలు ఉన్నట్లుగా తేలింది. అంతర్గత గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇక 3 సెంటీమీటర్లు లీనియర్ మచ్చ, ఇంకో మూడు చోట్ల సిగరెట్‌తో కాల్చిన గాయాలు ప్రత్యక్షమైనట్లు శవ పరీక్షలో తేలింది. అంతేకాకుండా నుదిటి, చేతులు, మోకాలి, పాదం, పిరుదుల ప్రాంతంలో కూడా గాయాలు ఉన్నట్లుగా పోస్టుమార్టం నివేదికలో పేర్కొంది. ఇక మెదడు రక్త నాళాలలో రక్తం అధికంగా పేరుకుపోయినట్లు తేలింది.

జూన్ 28న ఆభరణాల దొంగతనం కేసులో శివగంగ పోలీసులు విచారణ కోసం 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ గార్డును తీసుకెళ్లారు. అయితే విచారణ పేరుతో ఐదుగురు పోలీసులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రహస్యంగా ఒకరు చిత్రీకరించారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా పిలిచి వారిపై కూడా ఇలాగే ప్రతాపం చూపించారు. అజిత్ కుమార్ సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడి నోట్లో.. ఒంటిపై కారం చల్లి చితకబాదారని వాపోయాడు. స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు.

ఇక ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్‌ చేసినట్లుగా ఎలా చేస్తారని కోర్టు నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పౌరుడిని చంపేసిందని వ్యాఖ్యానించింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించద్దని న్యాయస్థానం మండిపడింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు బదిలీ చేసింది. అంతేకాకుండా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇక స్టాలిన్ స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సారీ చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News