Tamilnadu : అట్టుడుకుతున్న కళ్లకురిచి.. ఆ కేసును సీబీసీఐడీకి అప్పగించాలన్న మద్రాస్ హైకోర్ట్..

Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో విద్యార్ధిని ఆత్మహత్యపై చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారలేదు.;

Update: 2022-07-19 03:45 GMT

Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో విద్యార్ధిని ఆత్మహత్యపై చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారలేదు. డెడ్‌బాడీకి రీపోస్ట్‌మార్టం జరిపించి, కేసును సీబీసీఐడీకి అప్పగించాలని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది. కళ్లకురిచి విధ్వంసం తననెంతో బాధిస్తోందంటూ సీఎం స్టాలిన్ కామెంట్ చేశారు. నేరస్థులను తప్పకుండా శిక్షిస్తామని, వెంటనే ఆందోళనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ మూడు రోజులుగా కళ్లకురిచి జిల్లాలోని చిన్నసేలంలో పరిస్థితులు అట్టుడుకుతూనే ఉన్నాయి.

ఇంటర్ సెకండ్‌ ఇయర్ చదువుతున్న శ్రీమతి అనే విద్యార్ధిని 14వ తేదీన కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే, విద్యార్ధిని శ్రీమతి పోస్టుమార్టం నివేదిక అనుమానాలకు తావిచ్చింది. శ్రీమతి ఒంటిపై చనిపోడానికి ముందే తీవ్ర గాయాలుండడం.. ముక్కు, కుడిభుజం, కుడిచేయి, కడుపు పైభాగాన గాయాలు, దుస్తులలో రక్తపు మరకలు ఉన్నాయని నివేదికలో ఉంది. దీంతో తన కూతురి మృతిపై అనుమానాలున్నాయంటూ శ్రీమతి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. సీబీసీఐడీ విచారణ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. కళ్లకురిచి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నా, రాస్తారోకో చేశారు.

అటు విద్యార్థిని మృతిపై న్యాయవిచారణ జరపాలంటూ చిన్నసేలంలోని కాలేజ్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. పోలీసులపై రాళ్లు విసిరి, పోలీస్ వ్యాన్‌కు నిప్పంటించి, కాలేజ్ ఎంట్రన్స్‌ పగలగొట్టి, కాలేజీ బస్సులు, బైకులు, స్కూటర్లకు నిప్పంటించారు. కాలేజ్ బస్సులను ట్రాక్టర్‌తో ఢీకొట్టించి పూర్తిగా ధ్వంసం చేశారు.

క్లాస్‌రూమ్‌ వస్తువులను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అదనపు దళాలను మొహరించి, లాఠీ ఛార్జి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

విద్యార్ధిని శ్రీమతి రాసినట్టుగా చెబుతున్న ఓ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సరిగ్గా చదవలేదని టీచర్లు తనను వేధించినట్లు విద్యార్థిని రాసిన లేఖ బయటపడింది. దీంతో మ్యాథ్స్, సైన్స్ టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీపీఐ పామ్‌ప్లేట్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శ్రీమతి చదువుతున్న కాలేజ్‌లో వరుస మరణాలు జరుగుతున్నాయని, వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2005లో సీపీఐ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు సంబంధించిన పామ్‌ప్లేట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

విద్యార్థిని మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలన్న మద్రాసు హైకోర్టు.. రీపోస్టుమార్టంను వీడియో రికార్డ్ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. విద్యార్థిని మృతిపై సుప్రీం కోర్టులో అప్పీల్‌ దాఖలు చేయాలని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు తెలిపింది. క్రిమినల్‌ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సెషన్‌కు అధికార పరిధి లేదని, ప్రత్యేక న్యాయమూర్తి జారీచేసిన ఆదేశంపై అప్పీలుకు సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని తెలిపింది.

Tags:    

Similar News