Delhi Car Blast: రూమ్ నెం.13.. బిల్డింగ్ నెంబర్ 17 .. అదొక ఉగ్ర గూడు

తీగ లాగితే డొంకంతా కదులుతోంది

Update: 2025-11-13 07:15 GMT

తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన దర్యాప్తు సంస్థలు.. తవ్వేకొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి.

ప్రధానంగా అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. దేశ వ్యాప్తంగా నాలుగు నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా తేలింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమ్మిల్ డైరీల్లో ఈ ఉగ్ర ప్రణాళికను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఈ ఉగ్ర కుట్రకు యూనివర్సిటీలోని 17వ నెంబర్ భవనాన్ని ఉపయోగించుకున్నట్లుగా కనిపెట్టారు. ఈ భవనంలో ముజమ్మిల్‌కు 13వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లుగా తేలింది. గదిలో కొన్ని కెమికల్స్‌, డిజిటల్‌ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఉమర్‌కు 4వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచి కూడా మూడు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో పలువురి పేర్లు ఉన్నాయి. అలాగే దాడులకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఒకేసారి దాడులు జరిపేందుకు మూడు కార్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక కారు ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఇంకో కారు ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

మొత్తం 8 మందితో దేశ వ్యాప్తంగా దాడులు చేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు డైరీల నుంచి సేకరించిన సమాచారంతో అధికారులు కనిపెట్టారు. ఎనిమిది మందిలో ఉమర్‌, ముజమ్మిల్‌, డాక్టర్‌ అదిల్‌, డాక్టర్‌ షాహీన్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాడుల బాధ్యతలను పూర్తిగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమలు కోసం మొత్తం రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బుతోనే అన్ని పరికరాలు సేకరించి.. పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.

Tags:    

Similar News