Uttarakhand: సొరంగం వద్ద కార్మికుల కుటుంబాల ఆందోళన

రంగంలోకి దిగిన గుహ నుంచి థాయ్ పిల్లలను రక్షించిన సంస్థ;

Update: 2023-11-16 02:30 GMT

ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ శిథిలాల కింద 40 మంది కార్మికులు చిక్కుకొనే ఉన్నారు.  వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకూ ఏ మార్గమూ దొరకలేదు. ఈ క్రమంలోనే కొందరు వర్కర్స్‌ ఘటనా స్థలం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ తోటి కార్మికులను త్వరగా బయటకు తీయాలంటూ ఆందోళన చేశారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులతో గొడవకు దిగారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాళ్లు ఊరుకోలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అటు అధికారులు మాత్రం వాళ్లను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. డ్రిల్లింగ్ మెషీన్‌లతో శిథిలాలను కట్ చేస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. దాదాపు 70 గంటలుగా శిథిలాల కిందే చిక్కుకున్నారు. 


లోపలి చిక్కుకున్న 40 మంది కూలీలను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2018లో గుహ నుంచి థాయ్ పిల్లలను రక్షించిన సంస్థ సాయం తీసుకుంటున్నారు. భారత వైమానిక దళానికి చెందిన మూడు విమానాలు సామాగ్రిని తీసుకొస్తున్నారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన 900 మి.మీ. వ్యాసం కలిగిన ప్రత్యేక యంత్రం గంటలో 4-5 మీటర్ల శిధిలాలను తొలగిస్తుంది. అన్నీ సక్రమంగా జరిగితే మరో 10-12 గంటల్లో కూలీలు చిక్కుకున్న ప్రదేశానికి రెస్క్యూ పైపు చేరుకుంటుంది. యంత్రం కొద్ది గంటల్లో వచ్చే అవకాశం ఉందని, అది వచ్చిన తర్వాత అమర్చి పనులు ప్రారంభించవచ్చని అధికారులు తెలిపారు. 

2018లో ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్‌ గుహలో జూనియర్ అసోసియేషన్ ఫుట్‌బాల్ జట్టు ఇదేవిధంగా  చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని రక్షించడంలో సహాయం చేసిన థాయ్‌లాండ్‌కు చెందిన ఒక కంపెనీని రెస్క్యూలో పాల్గొన్న బృందాలు సంప్రదించాయి. 10 వేల మంది సిబ్బంది పాల్గొన్న ఆ రెస్క్యూకి వారం రోజులు పట్టింది.

సొరంగం లోపల కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో సూచనల కోసం నార్వేజియన్ జియోటెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కూడా సహాయం తీసుకున్నారు.   భారతీయ రైల్వేలు, దానికి అనుబంధంగా ఉన్న రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES),ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి నిపుణుల నుంచి కూడా సూచనలు తీసుకుంటారు. 

Tags:    

Similar News