Jagdeep Dhankhar: సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే వ్యాఖ్యలకు ధన్‌కర్ సమర్థన;
రాజ్యాంగ పీఠిక నుంచి ‘‘ సెక్యులర్’’, ‘‘సోషలిస్ట్’’ పదాలను తొలగించాలనే వాదన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే లేవనెత్తిన ఈ అంశాన్ని పలువురు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా ఈ పదాలను తొలగించాలనే వాదనకు మద్దతు తెలిపారు.
శనివారం జగదీప్ ధన్‌కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశికలో ‘సోషలిస్ట్’ ‘లౌకిక’ ‘సమగ్రత’ అనే పదాలను చేర్చినందుకు కాంగ్రెస్‌ను విమర్శించారు. “ఇది వేల సంవత్సరాలుగా ఈ దేశ నాగరికత సంపద, జ్ఞానాన్ని తక్కువ చేయడం తప్ప మరొకటి కాదు. ఇది సనాతన స్ఫూర్తికి అపచారం” అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ మార్పులు అస్తిత్వ సవాళ్లను కలిగిస్తున్నాయని, రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశ్యాన్ని ప్రతిబింబించాలని దేశానికి పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రవేశికను రాజ్యాంగం ఆత్మ అని అన్నారు. రాజ్యాంగంలోని దీనిని మార్చలేమని అన్నారు. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి బీజం లాంటిదని చెప్పారు.
సోషలిస్ట్, లౌకిక పదాలు ప్రవేశికలో ఉండాలా, వద్దా అనే దానిపై జాతీయ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఉపరాష్ట్రపతి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ పదాలు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో భాగం కాదని, అత్యవసర పరిస్థితి(1975-77) సమయంలో చేర్చబడ్డాయని హోసబాలే వాదించారు. అనేక మంది ప్రతిపక్ష నేతల్ని జైలులో ఉంచిన ఎమర్జెన్సీ సమయంలో 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని ఆయన చెప్పారు.