Ahmedabad: 80 లక్షల బీమా డబ్బుల కోసం మాస్టర్ ప్లాన్
17ఏళ్ల అజ్ఞాతం తర్వాత పోలీసులకు చిక్కి;
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చనిపోయినట్లుగా నమ్మించేందుకు ఒక బిచ్చగాడిని హత్య చేసింది ఒక కుటుంబం. ఏకంగా రూ.80 లక్షల బీమా డబ్బులు పొంది అంతా పంచుకున్నారు. చక్కగా మారు పేరుతో మరో నగరంలో జీవిస్తున్న ఆ వ్యక్తిని 17 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని భట్టా పర్సౌల్ గ్రామానికి చెందిన అనిల్ సింగ్ చౌదరీ ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగా 2004లో రూ.80 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక కారు కొన్నాడు.
తాను చనిపోయినట్లుగా నమ్మించి బీమా డబ్బు పొందేందుకు తండ్రి, సోదరులతో కలిసి ప్లాన్ వేశాడు. 2006 జూలై 31న రైలులో అడుక్కునే బిచ్చగాడిని ఆహారం ఇప్పిస్తామంటూ తమతోపాటు తీసుకువెళ్ళారు. ఆగ్రా సమీపంలోని హోటల్‌కు తీసుకెళ్ళి మత్తు మందు కలిపిన ఆహారం పెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ బిచ్చగాడిని కారులోకి ఎక్కించి ఒక విద్యుత్ స్తంభానికి కారుతో ఢీకొట్టారు. మత్తులో ఉన్న బిచ్చగాడిని డ్రైవర్ సీటులో కూర్చొబెట్టారు. ఆ తర్వాత ఆ కారుకు నిప్పుపెట్టారు. విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్ల జరిగిన ప్రమాదంలో ఆ కారు కాలిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. కారు కాలిపోయినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. కారు నంబర్ ఆధారంగా అనిల్ సింగ్ చౌదరీ తండ్రి విజయ్‌పాల్ సింగ్‌ను సంప్రదించారు. ప్లాన్ ప్రకారం డ్రైవర్ సీటులో కాలి చనిపోయిన వ్యక్తిని తన కుమారుడుగా విజయ్‌పాల్ సింగ్ గుర్తించాడు. అనంతరం మృతదేహానికి సొంతూరులో అంత్యక్రియలు నిర్వహించాడు. బీమా సంస్థ నుంచి రూ.80 లక్షలు పొందాడు. ఆ డబ్బును కుటుంబ సభ్యులు పంచుకున్నారు.
కాగా, తన వాటా డబ్బు తీసుకున్న అనిల్ సింగ్ అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. రాజ్‌కుమార్ చౌదరీగా పేరు మార్చుకుని ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. ఆటోతోపాటు బ్యాంకు రుణం ద్వారా కారు కొని దానిని నడుపుతూ జీవిస్తున్నాడు. సుమారు 17 ఏళ్లుగా సొంతూరుకు దూరంగా ఉన్నాడు. కనీసం కుటుంబ సభ్యులతో కూడా నాటి నుంచి మాట్లాడలేదు.
అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా భావించిన అనిల్ సింగ్ బతికే ఉన్నాడని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నికోల్ ప్రాంతంలో నివసిస్తున్న 39 ఏళ్ల వయసున్న అతడ్ని ఇటీవల అరెస్ట్ చేసి ప్రశ్నించారు. బీమా డబ్బు కోసం తండ్రితో కలిసి బిచ్చగాడిని హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించడంతో అతడి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు.