Tomato price high : సెంచరీ కొట్టేస్తున్న టమాటా

తుఫాను, భారీ వర్షాలతో పంటకు నష్టం..

Update: 2023-06-28 06:30 GMT

దేశవ్యాప్తంగా ఒక్క నెలలోనే టమాటా ధరలు రెట్టింపు అయ్యాయి. తుఫాను, రూతు పవనాలు ఇలా కారణాలు ఏదైనా కానీ ఇప్పుడు టమాట అటక ఎక్కి కూర్చుంది. చేతికి ఎప్పుడూ అందుబాటులో ఉండే టమాట ఇప్పుడు చెట్టు నుంచి దిగిరాకపోవటంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కూర ఏదన్నా దానికి టమాటా గ్రేవి యాడ్ చెయ్యాలి, చారు, రసం, సాంబార్.. పేరేదైనా అందులోకి ఒక్క టమాటా అయినా కావాలి. కానీ ఇప్పుడు టమాటా ధర మండిపోతుంటే సామాన్యుల కూరల సంచులు నిండేలోపు జేబులు ఖాళీ అవుతున్నాయి. వారం క్రితం వరకు రూ.30-40 పలికిన టమాటాలు నేడు అమాంతంగా రూ.100కు చేరాయి. మాములుగా కూడా టమాటా ధరలు నిలకడగా ఉండవు. పెరిగితే వినియోగదారులు భయపడేంత పెరుగుతాయి. తగ్గితే.. రోడ్డు పక్కన పారబోసేంత స్థాయికి పడిపోయి రైతులను ఏడిపిస్తాయి. బిపర్ జాయ్ తుఫాను, భారీ వర్షపాతం కారణంగా టమాటా ధరలు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరగగా, ఆ తరువాత రుతుపవనాలు ఉన్న పంటను కూడా నాశనం చేశాయి. సరఫరాలో అంతరాయం కూడా దీనికి తోడవ్వటంతో టమాటా మాత్రమే కాదు అన్ని ధరలూ పెరిగి పోయాయి. కొన్ని కూరగాయలు బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడంతో ఈ రేట్లు మరింత ప్రియమైయ్యాయి. టమాటాతోపాటు పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాప్సికం, బీర, బీన్స్ తదితర కూరగాయల ధరలు కూడా పెరిగాయి.

కరోనా తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఆకుకూరల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

వర్షాలు టమాటాల రవాణాపై ప్రభావం చూపాయని.. దాని కారణంగానే ధరలు పెరిగాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ అన్నారు. ధరల పెరుగుదల తాత్కాలికమేనని... త్వరలోనే తగ్గుతాయని ఆయన వెల్లడించారు. మరోవైపు ప్రధాని మోదీ తప్పుడు విధానాల వల్లే టమాటా ధరలు పెరిగాయని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Tags:    

Similar News