Tomato virus : మధ్యప్రదేశ్‌లో టమాటా వైరస్ కలకలం.

12 ఏళ్లలోపు చిన్నారులు జరభద్రం

Update: 2025-10-03 00:58 GMT

మధ్యప్రదేశ్‌  రాష్ట్రంలో టమోటా వైరస్  కలకలం సృష్టిస్తోంది. భోపాల్‌లో పాఠశాల పిల్లల్లో ఇది వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి సోకినవారి చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి. చిన్నారుల్లో దురద, మంట, నొప్పిగా అనిపించడంతోపాటు జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ లక్షణాలతో బాధపడేవారిని ఇంటివద్దే ఉంచాలని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను అప్రమత్తం చేశాయి.

ఈ టమోటా వైరస్‌ను ‘హ్యాండ్, ఫూట్‌, మౌత్‌ డిసీజ్‌ (HFMD)’ అంటారు. ఎచినోకాకస్, కాక్స్‌సాకీ వైరస్ వల్ల ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఆరు నెలల నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుందని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రాజేశ్ టిక్కాస్ వెల్లడించారు. హెచ్‌ఎఫ్‌ఎండీ మామూలు సమస్యేనని, పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదని అన్నారు. వారం, పది రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని చెప్పారు. దీనికి కారణమయ్యే వైరస్‌ చాలావరకు మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవటం, పరిశుభ్రత పాటించకపోవడంవల్ల వ్యాపిస్తుందని తెలిపారు.

వైద్య నిపుణులు తెలిపిన ప్రకారం.. ఈ వ్యాధి సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లతోనూ ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. లాలాజలం వంటి శరీర స్రావాలతోనూ సంక్రమిస్తుంది. వైరస్‌ సోకిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏదీ లేదు. గుండె, ఊపిరితిత్తులు, ఇతర జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లలకు అత్యంత అప్రమత్తతతో చికిత్స అందించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News