Train Accident: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ఇద్దరి మృతి
60 మందికి గాయాలు;
ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది. ఝార్ఖండ్ లోని చక్రధర్‌పూర్‌కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. సుమారు 60 మంది గాయపడినట్టు సమాచారం.
ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే ఉద్యోగులు చురుగ్గా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వ్యాగన్‌లను ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రైల్వే సమాచారం ప్రకారం హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11:02 గంటలకు టాటానగర్‌కు చేరుకోవాల్సి ఉండగా.. చాలా ఆలస్యంగా రాత్రి 2:37 గంటలకు చేరుకుంది. 2 నిమిషాలు ఆగిన తర్వాత తదుపరి స్టేషన్ చక్రధర్‌పూర్‌కి బయలుదేరింది. అయితే స్టేషన్‌కు చేరుకోక ముందే ప్రమాదానికి గురైంది.
కాగా.. సోమవారం బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ నుండి ఢిల్లీకి వెళుతుండగా దాని కప్లింగ్ లింక్ తెగిపోయింది. కొద్దిసేపటికే రైలులోని రెండు కోచ్‌లు విడిపోయాయి. రైలులో కూర్చున్న ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. అయితే, రైలు కోచ్‌లు విడిపోయిన తర్వాత ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సోమవారం దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న బీహార్ సంపర్క్ క్రాంతి రైలు ఖుదీరామ్ బోస్, పూసా సమస్తిపూర్‌లోని కర్పూరి గ్రామ్ రైల్వే స్టేషన్, ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్ మధ్య రెండు భాగాలుగా విడిపోయింది. ఘటన జరిగిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు.