Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ షాక్
విదేశీ విద్యార్థులను చేర్చుకోవద్దని హుకుం;
హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ మరో సీరియస్ యాక్షన్ తీసుకుంది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సర్టిఫికేషన్ తక్షణమే రద్దు చేయబడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేస్తే ఇదే పరిణామం ఎదురవుతుందని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజా పరిణామంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయం భారీ షాక్‌కు గురైంది.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో తనకు వ్యతిరేకంగా పని చేసిందంటూ హార్వర్డ్ యూనివర్సిటీపై కక్ష కట్టారు. దీంతో మొట్టమొదటిగా యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను నిలిపివేసింది. అంతేకాకుండా హమాస్‌కు మద్దతు ఇస్తూ.. యూదు మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని.. అలాగే చైనాకు సపోర్ట్‌గా వ్యవహరిస్తోందని ట్రంప్ సర్కార్ ఆరోపించింది. ప్రధానంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేసిందన్న కోపం యూనివర్సిటీపై ఉంది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీపై ట్రంప్ ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇటీవల యూనివర్సిటీలో పాఠ్యాంశాలు మార్చాలని.. ప్రవేశ విధానాలు, నియామక విధానాలు మార్చాలంటూ ట్రంప్ పరిపాలన హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాలను యూనివర్సిటీ తప్పుపట్టింది. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వాల జోక్యం ఏంటి? అని నిలదీసింది. అంతేకాకుండా ట్రంప్ సర్కార్ వైఖరిని తప్పుపడుతూ హార్వర్డ్ యూనివర్సిటీ న్యాయస్థానంలో దావా వేసింది. ఈ కేసు విచారణంలో ఉండగానే.. ఇంతలో మరోసారి విదేశీ విద్యార్థులను చేర్చుకోవద్దంటూ.. అందుకు సంబంధించిన సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజాగా ఈ అంశంపై కూడా విశ్వవిద్యాలయం దావా వేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
ట్రంప్ పరిపాలన హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే సామర్థ్యాన్ని నిషేధించిందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు. విశ్వవిద్యాలయంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఇలా చేస్తున్నట్లు తెలిపింది. అలాగే ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ యూదు మతానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. అంతేకాకుండా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ రద్దు చేసినట్లు పేర్కొంది. ఒకవేళ కావాలంటే 72 గంటల్లోపు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె తెలిపింది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఇతర విద్యాసంస్థల్లోకి బదిలీ కావాల్సి వస్తుందని లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోవాల్సి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.
అయితే ట్రంప్ సర్కార్ చర్య విశ్వవిద్యాలయానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధం అని తెలిపింది. 140 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, పండితులకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యాన్ని కొనసాగించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే యథావిథిగా విదేశీ విద్యార్థులను చేర్చుకుంటామని ఒక ప్రకటనలో యూనివర్సిటీ పేర్కొంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. హార్వర్డ్ వర్సిటీ 2024-2025 విద్యా సంవత్సరంలో దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇక యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ప్రతి సంవత్సరం 500-800 మంది భారతీయ విద్యార్థులు, స్కాలర్లు హార్వర్డ్‌లో చదువుతున్నారు. ప్రస్తుతం భారతదేశం నుంచి 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు.