Vijay: తిరిగి ప్రచారంపధంలోకి విజయ్.. క్యాడర్‌తో రహస్య భేటీ

కరూర్ తొక్కిసలాట తర్వాత మూడు నెలలుగా నిలిచిన విజయ్ ప్రచారం

Update: 2025-11-23 06:45 GMT

తమిళనాడులో తన రాజకీయ ప్రచారాన్ని పునఃప్రారంభించేందుకు ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా కాంచీపురం జిల్లాలోని మూడు తాలూకాలకు చెందిన ఎంపిక చేసిన పార్టీ క్యాడర్‌తో ఆయన రహస్యంగా సమావేశమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత దాదాపు మూడు నెలల పాటు నిలిచిపోయిన ప్రచార కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

పార్టీ భవిష్యత్ కార్యాచరణ, చేపట్టబోయే కార్యక్రమాలపై విజయ్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కరూర్‌లో జరిగినటువంటి తొక్కిసలాట వంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన కార్యకర్తలకు కీలక సూచనలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని స్థాపించిన విజయ్, కరూర్‌లో నిర్వహించిన తొలి బహిరంగ సభలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించడంతో విజయ్ తన ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న సేలంలో ర్యాలీ నిర్వహించేందుకు టీవీకే పార్టీ పోలీసుల అనుమతి కోరగా, వారు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ తన తదుపరి అడుగులను ఆచితూచి వేస్తున్నారు.

Tags:    

Similar News