Pahalgam Attack: పహెల్‌గామ్ మృతులకు కేంద్ర హోం మంత్రి నివాళి
ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలింపు;
పహెల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ప్రత్యేక విమానంలో మృతదేహాలను శ్రీనగర్ కంట్రోల్ రూంకి తరలించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడిన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.
మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా.. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. మరోవైపు.. పహల్గామ్‌లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఘటన తర్వాత అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
ఇక ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు అండగా ఉంటామని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఇక సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. ఉగ్ర దాడి వార్త తెలుసుకున్న వెంటనే హుటాహుటినా భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. బుధవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించనున్నారు.