Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ క‌ట్టిన కేంద్ర మంత్రి శివ‌రాజ్‌..

అనంతరం చౌహాన్‌కు రాఖీలు కట్టిన మహిళలు, యువతులు;

Update: 2025-08-09 07:45 GMT

దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగ సందర్భంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ వినూత్న కార్యక్రమంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన సంప్రదాయానికి భిన్నంగా ఓ చెట్టుకు రాఖీ కట్టి ప్రకృతి పరిరక్షణ ప్రాముఖ్యతను చాటారు.

భోపాల్‌లో జరిగిన రాఖీ వేడుకల్లో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్, ఓ వృక్షానికి రెండు రాఖీలు కట్టి, హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "వృక్షాలు మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. పక్షులు, ఇతర జీవరాశులు కూడా చెట్లనే జీవనాధారంగా చేసుకుని బతుకుతాయి. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత" అని సందేశమిచ్చారు. మానవ సంబంధాలతో పాటు ప్రకృతితో బంధాన్ని కూడా పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం అనంతరం, అక్కడికి వచ్చిన పలువురు మహిళలు, యువతులు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాఖీలు కట్టారు. ఆయన వారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో సంప్రదాయం, సామాజిక సందేశం కలగలిసి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags:    

Similar News