UNNAO CASE: ఉన్నావ్‌ కేసు.. మరో కీలక మలుపు

కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

Update: 2025-12-29 07:30 GMT

యావత్ దేశాన్ని కుదిపేసిన ఉన్నావ్‌ అత్యాచార కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు శిక్ష నిలిపివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో.. ఈ కేసు మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. 2017లో ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన ఓ మైనర్ యువతి. అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. అయితే న్యాయం కోసం ముందుకు వచ్చిన ఆమెకు అండగా నిలవాల్సిన వ్యవస్థే ఆమెను వేధించడం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఫిర్యాదు అనంతరం బాధితురాలు, ఆమె కుటుంబం తీవ్ర బెదిరింపులు ఎదుర్కొన్నారు. 2018లో బాధితురాలి తండ్రిని పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకుని హింసించారని ఆరోపణలు వచ్చాయి. ఆ హింస ఫలితంగా ఆయన మరణించారు. ఇది ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. అదే సమయంలో బాధితురాలి బంధువులు అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఈ కేసు వెనుక కుట్ర కోణాన్ని మరింత బలపరిచింది.

దేశవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి పెరగడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. బాధితురాలికి వై-ప్లస్ భద్రత కల్పించడంతో పాటు పరిహారం కూడా అందించారు. 2019లో ఢిల్లీ కోర్టు సెంగార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై కొంతమేర విశ్వాసాన్ని పునరుద్ధరించింది.

అయితే, తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుల్దీప్ సింగ్ సెంగార్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సెంగార్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, సెంగార్‌ను కస్టడీ నుంచి విడుదల చేయవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ తాజా పరిణామం మరోసారి ఉన్నావ్ కేసును జాతీయ చర్చకు తెచ్చింది.

Tags:    

Similar News