Uttarakhand: బద్రీనాథ్ లో హిమపాతం బీభత్సం..
మంచు చరియలు విరిగిపడి చిక్కుకున్న 57 మంది , 32 మందిని రక్షించిన సిబ్బంది;
ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది. ఈ క్రమంలో చమేలి జిల్లాలోని మన అనే సరిహద్దు గ్రామంలో చమోలి-బద్రీనాథ్ రహదారిపై ఏర్పాటు చేసిన శిబిరంపై పెద్దయెత్తున మంచు చరియలు విరుచుకు పడటంతో అక్కడ పనిచేస్తున్న 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) కార్మికులు చిక్కుకుపోయారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఇది చోటుచేసుకోగా, ఆ సమయానికి కార్మికులు ఎనిమిది కంటైనర్లు, ఒక షెడ్‌లో ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని బయటకు తీసేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
అధికారుల కథనం ప్రకారం ఇప్పటివరకు 32 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతికూల వాతావరణం, భారీ హిమపాతం ఏర్పడే ప్రమాదం ఉండటంతో సహాయ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మిగిలిన 25 మంది కార్మికుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బద్రీనాథ్‌లో జరిగిన ప్రమాదంలో మంచు చరియల కింద చిక్కుకున్న వారినందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
చైనాలోని కిన్‌లింగ్ పర్వతారోహణ కోసం ఫిబ్రవరి 8న బయల్దేరిన సున్ లియాంగ్ (18) అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలక్ట్రానిక్ డివైసెస్ పనిచేయకపోవడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చేసేదేమీ లేక నెమ్మదిగా కిందకు దిగడం ప్రారంభించాడు. చాలాసార్లు పట్టు తప్పి, పడిపోయాడు. కుడి చేయి ఎముక విరిగిపోయింది కూడా. ఆహారం లేకపోవడంతో మంచును, టూత్‌పేస్ట్‌ను తింటూ కాలం గడిపాడు. 10 రోజుల తర్వాత అతడిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు.