UCC: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి.. నేటి నుంచి అమలు
సీఎం పుష్కర్‌సింగ్ ధామి ప్రకటన;
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్నారు. పౌరులందరికీ సమానైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ప్రకటించారు.
గతేడాది ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని ఈ ఏడాది జనవరి పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. కాగా, పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.
యూసీసీలో ఉన్న నిబంధనలు
ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
వివాహ నమోదు తప్పనిసరి.
సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది. తెలిపారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకోవచ్చు.
సహజీవనం చేస్తున్న, చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి. చట్టాన్ని అతిక్రమిస్తే 6 నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు.
21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు.
తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే.. వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చినా.. వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాలి.