NDA vs INDIA bloc: రాధాకృష్ణన్ వర్సెస్ జస్టిస్ రెడ్డి.. కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు?
ఇద్దరూ ఇద్దరే..;
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కానున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈక్రమంలో సోమవారం ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఉంటుందా, ఉండదా అనే సందేహాలకు చెక్ పెడుతూ మంగళవారం ఇండియా అలయన్స్ తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఇద్దరు బలమైన ప్రొఫైల్ కలిగిన అభ్యర్థుల మధ్య జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా వారి మధ్య ఉన్న సారుప్యతలను(సిమిలారిటీస్), తేడాలను (డిపరెన్స్‌సెస్) ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇద్దరూ ఇద్దరే..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణ భారతదేశం నుంచి సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన ఆయన ఓబీసీ వర్గానికి చెందినవారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న ఎన్నికలకు ఈయన ఎంపికను ఓ రాజకీయ ఎత్తుగడగా కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణ భారతదేశానికి చెందిన జస్టిస్ రెడ్డిని ఎంపిక చేసింది. ఈయన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు.
సిపి రాధాకృష్ణన్ తన 16 ఏళ్ల వయసులో సంఘ్‌లో చేరారు. తరువాత జనసంఘ్‌లో చేరి పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఆయనకు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్‌తో లోతైన సంబంధాలు ఉన్నాయి. ఆయన బీజేపీ టికెట్‌పై కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. తర్వాత జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. సిపి రాధాకృష్ణన్ రూపంలో ఎన్డీఏ తన సొంత భావజాలం, రాజకీయ విలువలు కలిగిన వ్యక్తిని పోటీలో నిలిపింది. ఆయన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు అనేక విధాలుగా భిన్నంగా ఉన్నారు. ఆయనకు సంఘ్, బీజేపీ క్రమశిక్షణ గురించి పూర్తిగా తెలుసు. రానున్న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఓబీసీ కమ్యూనిటీకి చెందిన రాధాకృష్ణన్ ఎంపికలో బీజేపీ, ఎన్డీఏ రాజకీయ వ్యూహం కనిపిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జస్టిస్ రెడ్డికి ఇప్పటి వరకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన తన మొత్తం కెరీర్‌లో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సేవలందించారు. ఆయన 1971లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ప్రతిపక్షాల వ్యూహం రాజకీయేతర, అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడాని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియా కూటమి తరుఫున అభ్యర్థిగా జస్టిస్ రెడ్డిని ఎంపిక చేసేటప్పుడు.. కాంగ్రెస్ టీఎంసీ, డీఎంకె వంటి మిత్రపక్షాలను దృష్టిలో ఉంచుకుంది. డీఎంకె దక్షిణ భారతదేశం నుంచి అభ్యర్థిని కోరుకోగా, టీఎంసీ రాజకీయేతర వ్యక్తిని డిమాండ్ చేసింది. ఈ షరతులను దృష్టిలో పెట్టుకొని జస్టిస్ రెడ్డి పేరును కూటమి పార్టీలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. జస్టిస్ రెడ్డి పేరుకు ఆప్ తన మద్దతు ప్రకటించింది.