Vijay Rally: రేపు తమిళనాడులో విజయ్ భారీ ర్యాలీ..

సెలవు ప్రకటించిన ప్రైవేటు స్కూలు, భారీ భద్రతా ఏర్పాట్లు

Update: 2025-12-17 08:00 GMT

టీవీకే అధినేత, నటుడు విజయ్ మరోసారి తమిళనాడులో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రంలో తొలిసారి భారీ ర్యాలీ చేపడుతున్నారు. గురువారం ఈరోడ్‌ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ దగ్గర ప్రజలను ఉద్దేశించి విజయ్ ప్రసంగించనున్నారు. అయితే విజయ్ ర్యాలీ సందర్భంగా ఈరోడ్‌లోని ఒక ప్రైవేటు పాఠశాల సెలవు ప్రకటించింది. వార్షిక పరీక్షను కూడా వాయిదా వేసింది.

వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. సమయం దగ్గర పడడంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 18న ఈరోడ్‌ జిల్లాలో విజయ్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం టీవీకే నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక కరూర్ తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. వేదిక దగ్గర 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 72 మంది వైద్యులు, 120 మంది నర్సులతో కూడిన వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. సమన్వయం కోసం 40 వాకీ-టాకీలు, అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి 24 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ఇక 20 సింటెక్స్ ట్యాంకులు, హాజరైన వారందరికీ వాటర్ బాటిల్ పంపిణీ చేయనున్నారు. మూడు అగ్నిమాపక యంత్రాలు మోహరించనున్నాయి. 60 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన తర్వాత విజయ్ ర్యాలీలు, సభలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన సభకు కూడా భారీ ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News