విమానంలో హైజాక్ మాటల కలకలం
విమానంలో హైజాక్ అంటూ ఫోన్‌లో ముచ్చట్లు.. ఉరుకులు పరుగులు పెట్టిన సిబ్బంది.. నిమిషాల్లోనే ప్రయాణికుడి అరెస్ట్... మానసిక స్థితి సరిగ్గా లేదన్న పోలీసులు...;
విమానంలో హైజాక్ అంటూ మాట్లాడిన ప్రయాణికుడిని నిమిషాల్లోనే అరెస్ట్ చేశారు. విమానంలో హైజాక్ మాటల కలకలంవిమానం బయల్దేరే సమయంలో ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు కలకలం సృష్టించాయి. హైజాకింగ్ అంటూ అతడు ఫోన్‌లో మాట్లాడటం.. విమాన సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వెంటనే భద్రతాబలగాలు రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశాయి. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి ఓ విస్తారా (Vistara) విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. అంతలోనే ఓ ప్రయాణికుడు ‘హైజాకింగ్’ గురించి ఫోన్‌లో మాట్లాడటం విమాన సిబ్బందిలో ఒకరు విన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులనూ అలెర్ట్ చేశారు. వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైజాక్ గురించి మాట్లాడిన ప్రయాణికుడి మానసిక స్థితి సరిగా లేదని, 2021 నుంచి వైద్య చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అధికారులు తెలిపారు.