Waqf (Amendment) Act: వక్ఫ్ చట్టంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు..

చట్టంలోని మూడు అంశాలను సవాల్ చేస్తూ స్టే విధించాలని పిటిషన్లు..

Update: 2025-09-14 02:15 GMT

వక్ఫ్(సవరణ)చట్టం-2025పై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 తీర్పు వెల్లడించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ స్టే కోరుతూ దాఖలపై పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తుంది. మూడు ప్రధాన అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తుంది. వీటిలో ‘‘వక్ఫ్ బై యూజర్’’, వక్ఫ్ బై కోర్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది. మూడు రోజలు పాటు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత మే 22న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ను జారీ చేస్తుంది.

వక్ఫ్ సవరణ చట్టంలోని మూడు అంశాలను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మొదటిది- ఇప్పటికే వక్ఫ్ గా గుర్తించబడిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం, రెండోది- రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులకు చోటు, మూడోది- కలెక్టర్ విచారణ ద్వారా వక్ఫ్ ఆస్తి అవునా? కాదా? అని తేల్చడం.

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారి తరుఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. ఈ సవరణ చారిత్రక చట్టపరమైన, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వాదించారు. న్యాయరహిత ప్రక్రియ ద్వారా వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే మార్గంగా అభివర్నించారు. తుది విచారణ వరకు ఈ మూడు నిబంధనలపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. కేంద్రం తరుఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ చట్టాన్ని గట్టిగా సమర్థించారు. వక్ఫ్ ఇస్లామిక్ భావన అయినప్పటికీ, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని, దానిని లౌకిక భావనగా చూడాలని ప్రభుత్వం పేర్కొంది.

ఈ కేసుపై సెప్టెంబర్ 15న ఉదయం 10.30 గంటలకు తీర్పు ప్రకటించేలా జాబితా చేయబడింది. విచారణ సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి అనుకూలంగా రాజ్యాంగబద్ధత ఉందని బెంచ్ పునరుద్ఘాటించింది. ఏప్రిల్ 25న, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ చట్టంపై ఏదైనా “బ్లాంకెట్ స్టే”ని వ్యతిరేకిస్తూ 1,332 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025, పార్లమెంటు ద్వారా చెల్లుబాటు అయ్యేలా ఆమోదించబడిందని, రాష్ట్రపతి ఆమోదం పొందిందని మంత్రిత్వ శాఖ వాదించింది.

Tags:    

Similar News