AMIT SHAH: 2026 కల్లా మావోయిస్టులను ఏరివేస్తాం
సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరు భేష్... కొనియాడిన కేంద్ర హోంమంత్రి;
రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటి కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని తెలిపారు. నక్సలిజం పొలిటికల్ సమస్య కాదని, పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు రెడ్ కారిడార్.. మావోయిస్టుల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశామని వెల్లడించారు. ఇప్పుడు కేవలం 12 మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నాయని.. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాల పనితీరు భేష్ అని అమిత్ షా కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లో 22 మావోయిస్టులుమృతి చెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్‌ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఇది మరో పెద్ద విజయమని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు.
ఉగ్రమూకలపై కఠిన వైఖరే
కశ్మీరీ యువకులు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారని, గతంలో జరిగినట్లు ఉగ్రవాదులకు సానుభూతిగా ఆందోళనలు జరగట్లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అక్కడ సినిమా హాళ్లు నిండుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు. అవి ఉగ్రవాదుల పట్ల మెతకవైఖరి అనుసరించాయని దుయ్యబట్టారు. కేంద్రం ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అనుసరిస్తోందన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను దేశ భక్తులుగా కొనియాడే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.
అవినీతిని దాచేందుకే భాషా వివాదం
రాజకీయంగా లబ్ధి పొందేందుకు, అవినీతిని దాచి పెట్టేందుకే కొన్ని పార్టీలు భాష అంశాన్ని వివాదం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో మండిపడ్డారు. భాష పేరిట ఇప్పటికే దేశంలో చాలా వరకు విభజన జరిగిందని, ఇకపై జరగబోదన్నారు. హిందీ ఏ భాషకూ పోటీ కాదని, అన్ని భాషలకూ సోదర భాష అని పేర్కొనారు. కాగా డీఎంకే ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య NEP, త్రిభాష అంశంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.