Faridabad: ఫరీదాబాద్‌లో నిర్భయ తరహా ఘాతుకం
కదిలే కారులో 2 గంటల పాటు గ్యాంగ్ రేప్!
హర్యానాలోని ఫరీదాబాద్ లో అత్యంత అమానుష సంఘటన చోటుచేసుకుంది. కదులుతున్న వ్యాన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు ఈ దారుణం కొనసాగింది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులు తెల్లవారుజామున 3 గంటలకు బాధితురాలిని రోడ్డుపై విసిరేసి వెళ్లిపోయారు. ముఖంపై తీవ్ర గాయాలతో, రక్తమోడుతూ రోడ్డుపై పడి ఉన్న బాధితురాలు అతికష్టమ్మీద తన సోదరికి ఫోన్ చేసింద. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్ని తలపించేలా ఉన్న ఈ దారుణానికి సంబంధించిన వివరాలు..
సోమవారం రాత్రి బాధితురాలు ఇంటికి వెళ్లేందుకు ఓ బస్టాప్ లో నిలబడింది. కాసేపటికి అటుగా వచ్చిన వ్యాన్ బాధితురాలి వద్ద ఆగింది. అందులోని యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి బాధితురాలిని వ్యాన్ ఎక్కించుకున్నారు. ఆపై వ్యాన్ ను గురుగ్రామ్ రోడ్ కు మళ్లించి ఒకరి తర్వాత ఒకరు బాధితురాలిపై అత్యాచారం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ అకృత్యం కొనసాగింది. అడ్డుకున్న బాధితురాలిని చంపేస్తామని బెదిరించి మరీ అత్యాచారం జరిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎస్జీఎం నగర్ లోని రాజా చౌక్ వద్ద బాధితురాలిని వ్యాన్ లో నుంచి రోడ్డుపై తోసేసి వెళ్లిపోయారు.
బాధితురాలి ఫోన్ కాల్ తో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో పన్నెండు కుట్లు వేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ జరిగిన ఘోరం కారణంగా షాక్ లో ఉందని చెప్పారు. కాగా, ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలు కోలుకున్న తర్వాత స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.