PM Modi: బీజేపీ గెలిస్తేనే బెంగాల్‌లో మహిళలకు భద్రత: ప్రధాని మోదీ
టీఎంసీపై తీవ్ర విమర్శలు.. అవినీతిపై శ్వేతపత్రం హామీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. పూర్బ బర్ధమాన్, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తేనే మహిళలకు భద్రత కలుగుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో “జంగిల్ రాజ్” కొనసాగుతోందని ఆరోపించారు. టీఎంసీ పాలనలో అవినీతి, సిండికేట్ వ్యవస్థ పెరిగిపోయాయని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు నెలకు ₹3,000 ఆర్థిక సహాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు. అలాగే గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతి పై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి అవినీతిపరుడిని చట్టం ముందు నిలబెడతామని, రాజకీయ హింసపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అయుష్మాన్ భారత్ పథకాన్ని బెంగాల్‌లో వెంటనే అమలు చేస్తామని, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని మోడీ స్పష్టం చేశారు. చొరబాటుదారుల సమస్యపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ చేస్తున్న ప్రచారం అబద్ధమని కొట్టిపారేశారు.
తన సభలకు భారీగా జనసందోహం రావడం మార్పుకు సంకేతమని మోడీ పేర్కొన్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.