10-Minute Delivery: 10 నిమిషాల డెలివరీ రహస్యాన్ని బయటపెట్టిన జొమాటో సీఈఓ

డెలివరీ వేగం కాదు, దగ్గర్లో స్టోర్లు ఉండటమే కారణమన్న గోయల్

Update: 2026-01-02 05:00 GMT

జొమాటో, బ్లింకిట్ అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఈ వేగవంతమైన డెలివరీకి డెలివరీ పార్ట్‌నర్లు వేగంగా వాహనాలు నడపడం కారణం కాదని, కస్టమర్లకు అత్యంత సమీపంలో దట్టంగా ఏర్పాటు చేసిన 'డార్క్ స్టోర్ల' నెట్‌వర్కే కీలకమని ఆయన స్పష్టం చేశారు. డెలివరీ ఏజెంట్ల భద్రతపై వస్తున్న ఆందోళనలు, న్యూ ఇయర్ సందర్భంగా కొందరు గిగ్ వర్కర్లు చేసిన సమ్మె నేపథ్యంలో ఆయన 'X' వేదికగా ఈ వివరణ ఇచ్చారు.

గోయల్ ప్రకారం, ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ప్యాకింగ్‌కు సుమారు 2.5 నిమిషాల సమయం పడుతుంది. డెలివరీ సగటున 2 కిలోమీటర్ల లోపు దూరంలోనే ఉంటుందని, గంటకు కేవలం 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా 8 నిమిషాల్లో చేరవచ్చని వివరించారు. డెలివరీ ఆలస్యమైతే తమ ఏజెంట్లకు ఎలాంటి జరిమానాలు విధించమని, అలాగే సమయానికి డెలివరీ చేసినందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఉండవని ఆయన తేల్చిచెప్పారు. దీనివల్ల వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు.

డెలివరీ పార్ట్‌నర్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపైనా గోయల్ స్పందించారు. ఇది కేవలం డెలివరీ పార్ట్‌నర్ల సమస్య కాదని, మన సమాజంలోనే చాలా మందికి తొందర ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. యూనిఫాంలో ఉండటం వల్ల తమ వాళ్లు సులభంగా కనిపిస్తారని అన్నారు. కాగా, నిరసనల మధ్యే న్యూ ఇయర్ రోజున జొమాటో, బ్లింకిట్ కలిసి రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News