మేడ్చల్ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా ముగిసింది.. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన తనను, తన కుమారుడు జెడ్పీ ఛైర్మన్‌ను కించపరుస్తున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు.. పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు పిలవడం లేదంటూ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనూ జరిగిందని, అయితే దాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీఆర్‌ఎస్ కార్యకర్తలందరినీ పిలవలేదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని సుధీర్ రెడ్డి మాట్లాడారు.. అయితే, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగానే మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు మంత్రి మల్లారెడ్డి.. దీంతో గొడవ పెద్దది కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారిని సముదాయించారు.