Delhi : ఢిల్లీలో వడగాడ్పులకు 50 మంది బలి!
14 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి ఉష్ణోగ్రతలు;
దేశ రాజధాని ఢిల్లీని వడగాడ్పులు వణికిస్తున్నాయి. గత 48 గంటల వ్యవధిలో రాజధాని పరిధిలో 50 మంది మృత్యువాతపడినట్టు సమాచారం. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులుగా రాజధానిలో 35 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పౌరులు వేసవి తాపాన్ని తట్టుకోలేక అల్లాడుతున్నారు. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడటం లేదని వారు వాపోతున్నారు. గత 14 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరంలో పచ్చదనం అంతరించిపోయి, విచ్చలవిడిగా నిర్మాణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. వడగాల్పులు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద ఆరోగ్య శాఖ బుధవారం అడ్వైజరీ జారీ చేసింది. వడదెబ్బ రోగులకు ప్రత్యేక యూనిట్లు ఏర్పాటుచేయాలని దవాఖానలను ఆదేశించింది.