Plane Missing : అమెరికాలో విమానం మిస్సింగ్..
మొన్న ప్రమాదం.. ఇప్పుడు అదృశ్యం..;
అమెరికాలోని అలస్కా మీదుగా 10 మందితో వెళ్తున్న ఓ విమానం అదృశ్యమైంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దీనిపై మాట్లాడుతూ.. ఉనాలాక్లీట్ నుంచి బయలుదేరి నోమ్ వెళ్తున్న సమయంలో సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ విమానం అదృశ్యమైనట్లు వివరించారు.
ఆ విమానం అమెరికాకు చెందిన బెరింగ్ ఎయిర్ ఎయిర్‌లైన్ సంస్థదని చెప్పారు. విమానంలో మొత్తం పది మంది ఉండగా, వారిలో తొమ్మిది మంది ప్రయాణికులు, ఒకరు పైలట్. అదృశ్యమైన విమానాన్ని గుర్తించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, వారం రోజుల క్రితమే అమెరికాలోని జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ డీసీలోని ఓ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్ అవుతుండగా ఆ ప్రమాదం సంభవించింది. ఇటీవల మరో ప్రమాదంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ వద్ద ఓ విమానం కూలింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. అంతేగాక, అక్కడి ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. అమెరికాలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.