ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త సీజేలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్... తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అలోక్ అరధే.... సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని సూచించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అదే రాష్ట్ర హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలీజియం సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. అయితే, మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించాలన్న సిఫారసును మార్చి, ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.