Uttarakhand Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. ఏడుగురి మృతి,
సహాయక చర్యలు ముమ్మరం
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. భికియాసైన్ – వినాయక్ రోడ్డులో ఒక ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.
పలు నివేదికల ప్రకారం.. భికియాసైన్-వినాయక్-జలాలి మోటార్ రోడ్డులోని శిలాపాణి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ద్వారహత్ నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో బయలుదేరిన బస్సు భికియాసైన్ నుంచి రామ్‌నగర్‌కు వెళుతూ.. మార్గమధ్యలో నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు భికియాసైన్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.