T20 MATCH: అభిషేక్ శతక గర్జన
రెండో టీ 20లో టీమిండియా ఘన విజయం... సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ;
జింబాబ్వేతో జరిగిన రెండో టీ 20 టీమిండియా ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ శతకంతో చెలరేగగా జింబాబ్వేపై వంద పరుగుల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన తొలి టీ 20లో ఎదురైన పరాజయానికి గిల్ సేన గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ 20లో జింబాబ్వేను వంద పరుగుల తేడాతో భారత జట్టు ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ సెంచరీ చేయగా... రుతురాజ్ గైక్వాడ్, రింకూసింగ్ మెరుపు బ్యాటింగ్ చేశారు.
అనంతర భారత బౌలర్లు రాణించడంతో జింబాబ్వే 134 పరుగులకే ఆల్‌ట్ అయింది. దీంతో 100 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఈ విజయంతో అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో 1-1తో సమమైంది.జింబాబ్వేతో జరిగిన రెండో టీ 20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్... బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు పరుగులే చేసి అవుటైపోయాడు. కానీ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగి విరుచుకుపడ్డాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన అభిషేక్...33 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన అభిషేక్ మరో 13 బంతుల్లోనే ఇంకో 50 పరుగులు రాబట్టి శతకం చేసేశాడు. తొలి అర్ధ సెంచరీకి 33 బంతులు తీసుకున్న అభిషేక్... రెండో 50 పరుగులు చేసేందుకు కేవలం 13 బంతులే తీసుకున్నాడు. ఆడుతున్న రెండో మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీతో టీమిండియాలో స్థానాన్ని సుస్ధిరం చేసుకునే దిశగా తొలి అడుగు వేసేశాడు.
అభిషేక్ జింబాబ్వే బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి చెలరేగిపోయాడు. పసికూన బౌలర్లను కసితీరా బాదేశాడు. ఇక ఈ ఇన్నింగ్స్‌తో తన పేరు మార్మోగేలా చేశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా సెలెక్టర్లకు స్పష్టమైన సందేశం పంపాడు. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసేసి అతి తక్కువ మ్యాచ్‌లు ఆడి శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మేయర్స్ వేసిన పదకొండో ఓవర్‌లో అభిషేక్ 28 పరుగులు బాదేశాడు. ఆ ఓవర్‌లో అభిషేక్ రెండు భారీ సిక్సర్లు, మూడు బౌండరీలు బాదేసి శతకానికి సమీపించాడు. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 పరుగులు చేసి మెరుపు బ్యాటింగ్ చేయగా. రింకూ సింగ్ కేవలం రింకూసింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 48 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇక లక్ష్య ఛేదనలో జింబాబ్వేకు భారత్ ఏ దశలోనూ మరో అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్‌లోనే జింబాబ్వే ఓపెనర్‌ను ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు. ఇన్నోసెంట్ కైయాను ముఖేష్‌కుమార్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మెద్వెవెరె 43, బెన్నెట్ 26 పరుగులు మాత్రమే పోరాడారు. మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. దీంతో 134 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 3, ఆవేష్‌ఖాన్ 3 వికెట్లు తీశారు.