AKRAM: స్వింగ్ సుల్తాన్.. ఇప్పడు బెట్టింగ్ కింగ్
చిక్కులో స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్... లెజెండ్ బౌలర్‌పై సైబర్ కేసు... భారత్-పాక్ మ్యాచ్‌పై శాంతిమంత్రం;
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నందుకు ఈ లెజెండరీ క్రికెటర్‌పై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది. పాకిస్థాన్‌లో బెట్టింగ్ పూర్తిగా నిషేధించబడినప్పటికీ.. ఆయన ఒక విదేశీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేశారని ఆరోపణలు రావడంతో ఆయనపై పాకిస్థాన్ సైబర్ క్రైమ్ డివిజన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటన పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి వసీం అక్రమ్‌పై పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి ఫిర్యాదు ప్రకారం.. వసీం అక్రమ్ 'బాజీ' అనే విదేశీ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి సాక్ష్యంగా వసీం అక్రమ్ నటించిన ప్రకటన పోస్టర్లు, వీడియోలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. పాకిస్థాన్‌లో ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ 2016 ప్రకారం ఇది చట్టవిరుద్ధం కావడంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత పాకిస్థాన్ జాతీయ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దీనిపై స్పందించారు. 'వసీం అక్రమ్ ఒక విదేశీ బెట్టింగ్ యాప్‌కు ప్రచారకర్తగా ఉన్నారని మాకు ఫిర్యాదు అందింది. ఈ ఆరోపణలు నిజమైతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం' అని ఓ అధికారి ధ్రువీకరించారు.
' దేశభక్తి వేరు.. ఆట వేరు'
ఇదిలా ఉంటే ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 14న జరగబోయే మ్యాచ్ పై అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌పై ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. క్రికెట్ కొనసాగడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత్‌లో కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'స్టిక్ విత్ క్రికెట్' అనే పాడ్‌కాస్ట్‌లో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. 'ఆసియా కప్ షెడ్యూల్‌పై వస్తున్న కఠినమైన స్పందనలను మేం చూశాం. కానీ పాకిస్థాన్‌లో మేము ప్రశాంతంగా ఉన్నాం. మేము ఆడినా, ఆడకపోయినా పర్వాలేదు. కానీ ఆట మాత్రం కొనసాగాలి' అని అన్నారు. భవిష్యత్తులో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. వసీం తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ.. 'నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. నేను రాజకీయ నాయకుడిని కాదు. వారు తమ దేశానికి, మేము మా దేశానికి దేశభక్తులం. ఎవరూ హద్దు మీరి మాట్లాడకూడదు. కేవలం తమ దేశం సాధించిన విజయాల గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ విషయం భారత్, పాకిస్థాన్ ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ ఇది చెప్పడానికి సులభం, అమలు చేయడం కష్టం' అని అన్నారు. ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ, ఈ బౌలర్ తన వైఖరి స్పష్టం చేశారు.
మరోవైపు ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టులో బాబర్ ఆజంకు స్థానం లభించలేదు. దీనిని చూసి చాలా మంది పాకిస్తాన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, పాకిస్తాన్ వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ దీని గురించి కీలక విషయం వెల్లడించాడు. మైక్ హెస్సన్ ప్రకారం, బాబర్ ఆజమ్‌ను తొలగించడం అంత సులభమైన నిర్ణయం కాదు. కానీ, అతని టీ20 బ్యాటింగ్‌లో కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో మెరుగుదల అవసరమని జట్టు యాజమాన్యం భావించింది. ప్రధానంగా ఈ కింది రెండు విషయాలను హెస్సన్ ప్రస్తావించాడు.