AMITH MISHRA: 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అమిత్ మిశ్రా గుడ్ బై
రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్... 25 ఏళ్ల కెరీర్‌కు 42 ఏళ్ల మిశ్రా వీడ్కోలు... 22 టెస్టులు, 36 వన్డేలు ఆడిన మిశ్రా
టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 42 ఏళ్ల అమిత్ మిశ్రా.. తన 25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 36 వన్డేలు, 10 టీ20 మాత్రమే ఆడి వరుసగా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు. గాయాల బెడదతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తరచూ గాయాల బారిన పడుతుండటం, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.
భావోద్వేగ పోస్టు
"క్రికెట్ లో నా ఈ 25 ఏళ్ల ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహాయక సిబ్బంది, సహచరులు, నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎక్కడ ఆడినా నన్ను ఎంతగానో ఆదరించిన అభిమానుల ప్రేమ, మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను. క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. మైదానంలో గడిపిన ప్రతీ క్షణం నా జీవితాంతం గుర్తుండిపోతుంది" అని అమిత్ మిశ్రా తెలిపాడు. ఇక, భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ క్రికెటర్లకు మెంటార్ గా వ్యవహరిస్తూ ఆటకు దగ్గరగా ఉండాలనుకుంటున్నట్లు మిశ్రా తన ప్రకటనలో పేర్కొన్నాడు. ‘నేను ఎల్లప్పుడూ జట్టుకు ప్రాధాన్యత ఇచ్చాను, ఇప్పుడు కొత్త క్రికెటర్లకు అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. అమిత్ మిశ్రా 2017లో భారతదేశం తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. దీని తర్వాత దేశీయ క్రికెట్, IPLలో ఆడటం కొనసాగించాడు. అతని చివరి మ్యాచ్ IPL 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాజస్థాన్‌తో జరిగింది. ఆ మ్యాచ్‌లో, మిశ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 20 పరుగులకు 1 వికెట్ తీసుకున్నాడు.
చెక్కు చెదరని రికార్డ్
2008లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున తొలి హ్యాట్రిక్ సాధించిన అమిత్ మిశ్రా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 2011లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2013లో హ్యాట్రిక్ వికెట్ తీసాడు. కోచ్‌గా, కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాలని అమిత్ మిశ్రా భావిస్తున్నాడు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్‌తో ప్రేక్షకులతో టచ్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. అమిత్ మిశ్రా.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ట్రై సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2008లో ఆస్ట్రేలియాతో మోహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అమిత్ మిశ్రా.. 2010లో జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టి జవగళ్ శ్రీనాథ్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్‌ను అమిత్ మిశ్రా సమం చేశాడు. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఆడిన మిశ్రా 10 వికెట్లు తీసాడు. ఈ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.