AMITH MISHRA: నచ్చిన వారికే జట్టులో చోటు
జట్టులో చోటుపై అమిత్ మిశ్రా సంచలన ఆరోపణలు.... పలు అనుభవాలు పంచుకున్న దిగ్గజ స్పిన్నర్ మిశ్రా... కెప్టెన్‌కు నచ్చకపోవడం నో ఛాన్స్: స్పిన్నర్
టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టుకు ఆడే సమయంలో సెలక్షన్ విధానం వేరుగా ఉండేదని పేర్కొన్నాడు. కెప్టెన్లకు నచ్చితే అవకాశాలు వస్తూనే ఉంటాయని.. లేదంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోవాల్సి ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకొన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని స్థాయిల్లోనూ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు అతడు తెలిపాడు. కాగా 43 ఏళ్ల మిశ్రా తొలిసారి 2003లో భారత జట్టుకు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు.
సంచలన ఆరోపణలు చేసిన మిశ్రా
తన మనసులోని భావాలను అమిత్ మిశ్రా నిస్సందేహంగా బయటపెట్టాడు. కెరీర్లో ఎదురైన పలు అనుభవాలను వెల్లడించాడు. చివరిసారిగా 2017లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అమిత్ మిశ్రా.. ఆ తర్వాత కేవలం ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు. ఇక ఈ మెగా లీగ్‌లోనూ 2024లోనే చివరి మ్యాచ్ ఆడాడు. మూడుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా ఇప్పటికీ అతడి పేరిటే రికార్డు ఉంది. కానీ, జాతీయ జట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. దానికి కారణం తాను ‘కెప్టెన్’కు ఇష్టమైన ప్లేయర్ కాకపోవడమేనని మిశ్రా వ్యాఖ్యానించాడు. ‘నా జీవితంలో అన్ని రకాలుగా భాగమైన క్రికెట్‌కు 25 ఏళ్ల తర్వాత గుడ్‌బై చెబుతున్నా. నా కెరీర్లో ఎన్నో విజయాలు, మలుపులు, భావోద్వేగాలు ఉన్నాయి. నా కెరీర్లో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. మరో రూపంలో ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది’ అని అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు టీమిండియాలో అవకాశాలు తక్కువగా రావడం పట్ల స్పందించాడు. ‘‘నిజంగా ఓ ఆటగాడిని అన్నింటికంటే నిరాశపరిచే విషయం ఇదే. కొన్నిసార్లు జట్టులో ఉంటాము.. మరికొన్ని సార్లు మనల్ని ఎంపిక చేయరు. మరికొన్నిసార్లు జట్టులో ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉండదు. ఇలాంటివి తరచూ జరుగుతూ ఉంటే విసుగు వస్తుంది. నా విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. కొంత మంది ఆటగాళ్లంటే కెప్టెన్లకు ఇష్టం. కాబట్టి వారికి వరుస అవకాశాలు వస్తూ ఉంటాయి. అయినా.. అదో పెద్ద విషయం కాదు. ఏదేమైనా మనల్ని మనం నిరూపించుకుంటే అవకాశం అదే తలుపు తడుతుంది.” అని మిశ్రా అన్నాడు.
హ్యాట్రిక్ మధుర జ్ఞాపకం
తొలి ఐపీఎల్ సీజన్లోనే హ్యాట్రిక్ తీసిన అమిత్ మిశ్రా.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. షాహిద్ అఫ్రిది, గిబ్స్ వంటి డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ‘‘నాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలంటే ఐపీఎల్ 2008 సీజన్లో హ్యాట్రిక్. డెక్కన్ ఛార్జర్స్‌పై దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున నేను ఐదు వికెట్ల ప్రదర్శన చేశా. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం అయ్యింది. దానికి ముందే దేశవాళీలో నిలకడగా బౌలింగ్ చేశా. కానీ, టీమ్ఇండియాలో మళ్లీ ఛాన్స్రాలేదు. ఎప్పుడైతే ఐపీఎల్లో హ్యాట్రిక్‌తో మెరిశానో.. మళ్లీ పిలుపు వచ్చింది.’’ అని అమిత్ గుర్తు చేసుకున్నాడు. అమిత్ మిశ్రా 2003లో అరంగేట్రం చేయగా.. సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడాడు. 2003లో ఢాకాలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మిశ్రా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2008లో ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. భారత్ తరఫున 22 టెస్ట్‌లు, 36 వన్డేలు, 10 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు.